సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మండిపడ్డారు. అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా జయప్రదం కోసం వెళ్తున్న సీఐటీయూ నాయకులను, అంగన్‌వాడీ టీచర్ల హెల్పర్లను పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ...అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రశాంతంగా చలో హైదరాబాద్‌కు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చినా అరెస్టు చేయడం దారుణమన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఐసీడీఎస్ పరిరక్షణ కోసం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, అనిత, రాణి, లక్ష్మి, గాయత్రి, అక్షద, కృష్ణవేణి, స్వరూప, మందాకిణి తదితరులు పాల్గొన్నారు.


