● త్వరలోనే చర్యలు చేపడతాం
● మంత్రి కొండా సురేఖ వెల్లడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం మంత్రి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండగుట్టపై నిర్మించిన 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.


