వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

Mar 15 2026 6:46 AM | Updated on Mar 15 2026 6:46 AM

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు.

టిప్పర్‌ ఢీకొని విద్యార్థి..

పటాన్‌చెరు టౌన్‌: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... హైదరాబాద్‌ ఎరగ్రడ్డ ఆనందనగర్‌కు చెందిన సుకేశ్‌(19) రూట్స్‌ అకాడమీలో యానిమేషన్‌ డిప్లొమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఐఐటీ హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ – సమ్మిట్‌కు తన స్నేహితుడు రజనీకాంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రుద్రారం గ్రామ శివారు ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే టిప్పర్‌ డ్రైవర్‌ శ్యామ్‌ అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనం నడుపుతున్న సుకేశ్‌ కింద పడిపోగా అతని పైనుంచి టిప్పర్‌ చక్రం ఎక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రజినీకాంత్‌ కింద పడిపోవడంతో అతని కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు బైకులు ఢీకొని యువకుడి..

పాపన్నపేట(మెదక్‌): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నార్సింగి శివారులోని దారిదేవుని గుడి వద్ద శనివారం జరిగింది. బాధిత వర్గాల కథనం ప్రకారం.. మండల పరిధిలోని యూసుఫ్‌పేటకు చెందిన తుడుం నాని (21), అర్కెల లడ్డు ద్విచక్ర వాహనంపై నార్సింగి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.

బైక్‌ అదుపుతప్పి ఒకరు..

మనోహరాబాద్‌(తూప్రాన్‌): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా గుండారం గ్రామానికి చెందిన మల్లెపూల నాగరాజు (24) నెల రోజుల క్రితం సికింద్రాబాద్‌, పార్శిగుట్టలో భార్య శిరీషతో కలిసి అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్‌ చేసి బయలు దేరాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి–44పై బైక్‌ అదుపుతప్పి రోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. కాగా మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement