● కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టి ● రైతులకు ఉచితంగా కూరగాయలకిట్ల పంపిణీ ● జిల్లాకు 3,420 కిట్లు మంజూరు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం రైతులను ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తోంది. కూరగాయల పంటలు సాగు చేసేందుకు ముందుకొచ్చే అన్నదాతలకు కూరగాయలు, ఆకు కూరల కిట్లను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి కిట్లను పంపిణీ చేస్తోంది. ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగు చేసే అవకాశంతో పాటు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలను ఆర్జించవచ్చు. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండటంతో మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం జిల్లాలో చాలా రకాల కూరగాయలు సాగవుతుండగా, మరికొన్ని రకాల కోసం ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీగ జాతి కూరగాయల సాగును పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ఉచితంగా కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
ఉచిత కిట్లలో ప్రాధాన్యం వీటికే..
జిల్లాకు ప్రభుత్వం 3,420 కిట్లను మంజూరు చేసింది. ఉచిత కిట్లలో ప్రధానంగా తోటకూర, పాలకూర, టమాటా, చిక్కుడు, బీరకు చెందిన విత్తనాలు ఉన్నాయి. వీటిని బెంగలూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇవి ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంతో అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. పాలకూర, తోటకూర 25, చిక్కుడు, బీర 40 రోజులు, టమాట 50 రోజులకు దిగుబడి రానుంది.
రైతులకు ఉపాధి
ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది. రైతులకు మేలైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో రైతులకు ఉపాధి దొరుకుతుంది.
– అబ్దుల్ రషీద్, ఉద్యాన రైతు, ఇశ్రితాబాద్
రైతులను ప్రోత్సహించేందుకే...
ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి కిట్లను పంపిణీ చేస్తున్నాం. రైతులకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
– సతీశ్, ఉద్యానవన విస్తరణ అధికారి, సదాశివపేట


