రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న గృహవసర గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్‌ఐ బాల్‌రాజు, మండల ఆర్‌ఐ గోపి, తమ సిబ్బందితో శనివారం సాయంత్రం హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ రజని తెలిపారు. గృహవసర సిలిండర్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఓ కవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2026– 27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు సంబంధించి మే 3న పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 16 నుంచి వచ్చేనెల 15 తేదీ వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సమాజానికి
దిశానిర్దేశం చేసేది కవిత్వమే
ప్రముఖ కవి, రచయిత పవన్‌కుమార్
సిద్దిపేటకమాన్: సమాజంలో నెలకొన్న అసమానతలు, రుగ్మతలను రూపుమాపి దిశానిర్దేశం చేసేది కవిత్వమేనని ప్రముఖ కవి, రచయిత పవన్‌కుమార్ అన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సమాజంలో వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ కవుల రచనలో ప్రస్ఫుటించాలని కోరారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో అశోకరాజు, మహిపాల్, మహేందర్, విజయ, ఉమారాణి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
మద్దూరు(హుస్నాబాద్): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మహ్మద్ అసీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... దూల్మిట్ట మండల కేంద్రంలోని మోయతుమ్మెద వాగు నుంచి సుద్దాల బాబు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడులు నిర్వహించి ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
జూదరుల అరెస్ట్
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని పొడిచన్‌పల్లి తండా శివారులో శనివారం జూదం ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి 10 ఫోన్లు, రూ.20,040 స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించగా జూదం ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


