దుబ్బాకరూరల్: విద్యుత్ మోటార్‌ను బయటకు తీస్తుండగా వాగులో పడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్‌పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టెబుల్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పొలానికి నీటి సరఫరా కోసం రైతులు కూడవెల్లి వాగులో విద్యుత్ మోటార్లు వేశారు. వాగు నుంచి మోటార్లు బయటకు తీసేందుకు లక్ష్మణ్, బాలయ్య, కనకయ్య వెళ్లారు. మృతుడు ఎనగుర్తి లక్ష్మణ్(50) మొదటగా కొయ్యాడ స్వామిగౌడ్‌కు చెందిన మోటారును బయటకు తీశాడు. అదే విధంగా పోసిగారి ప్రభాకర్ మోటారును బయటకు తీయమని కమటం సురేశ్, ఇస్తారు మల్లయ్య అడిగారు. లక్ష్మణ్ మోటారును బయటకు తీస్తున్న క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వాహనం ఢీకొని..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పెద్దాపూర్‌లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్ వివరాల మేరకు... ఈనెల 12న రాత్రి 11గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెద్దాపూర్ శివారులో గల భారత పెట్రోల్ బంకు సమీపంలో కాలి నడకన రహదారిని క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి.
విద్యుదాఘాతంతో కార్మికుడు..
శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని గోమారంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరుడి రాములు(48) గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం గ్రామంలో నీరుడి రాములు మరో ఇద్దరు కార్మికులతో కలిసి విద్యుత్ సరఫరా నిలిపివేసి స్తంభాలపై వీధిలైట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా అనంతరం చౌరస్తా వద్ద ఓ స్తంభానికి లైటు వెలగకపోవడంతో విద్యుత్ ఉండగానే నిచ్చెన సాయంతో మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి స్తంభం పైనుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వాగులో పడి రైతు మృతి


