పటాన్‌చెరు: గంగా జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని, ముస్లింల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేసిన మహోన్నత నేత మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మహమూద్ అలీతో పాటు, శాసనమండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారన్నారు. 27 ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ... ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ముగిసిపోయేలా అల్లాను ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ


