నారాయణఖేడ్: విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారంపై విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా 30 ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చాయని, త్వరలో మరో 60 ట్రాన్స్‌ఫార్మర్లు రానున్నాయని తెలిపారు. నాగన్‌పల్లి, ఇస్లాంపూర్., ఇరక్‌పల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు స్థలాల ఎంపిక జరగగా బోర్గీలో స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కడ్పల్‌లో 132 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలం ఎంపిక జరిగిందన్నారు. 1,000 విద్యుత్ స్తంభాలకు ప్రతిపాదించామని చెప్పారు. ఖేడ్ పట్టణంలో రూ.25 లక్షలతో మరో రెండు ఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. 160 కేవీకి సంబంధించి ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరుకాగా మూడు విడుదలయ్యాయని పేర్కొన్నారు. 50 ఎల్డీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, అవసరాల మేరకు ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 200 స్తంభాలు కేబుళ్లతోసహ ప్రతిపాదించామన్నారు. కౌలాస్‌నాలా ద్వారా కంగ్టి మండలంతోపాటు, జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు పంపామని వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమీక్షలో విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి


