జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, ఎన్‌ఐ యాక్టు, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కాంపౌండబుల్, సివిల్, చెక్‌బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు లోక్‌అదాలత్‌లో కేసులు రాజీ చేసుకుంటే సమయం వృథా అవదన్నారు. న్యాయవాదులు అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు.
సెల్‌ఫోన్‌లు అప్పగింత
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను నూతన టెక్నాలజీ సాయంతో గుర్తించి బాధితులకు అప్పగించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్నట్లు బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు పీఎస్‌లలో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు నూతన టెక్నాలజీ సాయంతో పోగొట్టుకున్న వాటిని గుర్తించి 109 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, నర్సింహులు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, శ్రీను పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్‌లకు జరిమాన
కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌లను అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారుల సమాచారంతో.. మండలంలోని కూరెళ్ల పరిధి శివారులో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను తహసీల్దార్ చంద్రశేఖర్ పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.15వేల చొప్పున జరిమానా విధించి, ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదవశాత్తు
రైలు పట్టాల కిందపడి..
కాలు తెగి వ్యక్తికి తీవ్ర గాయాలు
మనోహరాబాద్(తూప్రాన్): రైలు ఎక్కుతున్న క్రమంలో పట్టాల మధ్య పడి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. గురువారం 108 ఈఎన్‌టీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్–కాచిగూడ రైలులో చేగుంటలో బిహారీలాల్ (58) ఎక్కాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్ వద్ద రైలు ఆగడంతో కిందిగి దిగిన అతడు కదులుతున్న ట్రైన్ ఎక్కు తుండగా ప్రమాదవశాత్తు పట్టాల మధ్య పడిపోయాడు. దీంతో అతని కుడి కాలు తేగిపోవడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి ప్రథమ చికిత్స చేసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కొడుకును
వెతికేందుకు వెళ్లి..
కుంటలో పడి తల్లి మృతి
తూప్రాన్: వారం రోజులుగా కన్న కొడుకు కనిపించకపోవడంతో వెతకడానికి వెళ్లిన తల్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందింది. ఈ సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు వివరాల ప్రకారం... కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అనారోగ్యానికి గురైన లక్ష్మి తన రెండో కుమారుడితో బుధవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో తన పెద్ద కుమారుడి మాదిరిగా కనిపించిన యువకుడిని చూసి వెనకాల వెళ్లిన ఆమె రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి మృతి చెందింది. వెంటనే గ్రామస్తుల సహకారంతో బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


