ఆందోళనకు గురిచేస్తున్న తల్లిదండ్రుల తీరు
● కొందరు మగబిడ్డ పుట్టలేదని.. ● పోషించే స్థోమత లేక.. డబ్బులకోసం ఇంకొందరు
మెదక్‌జోన్: నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారుముద్దుగా పెంచాల్సిన ‘అమ్మానాన్న’ అనే పదానికే కొందరు మచ్చ తెస్తున్నారు. పేగుబంధాన్ని మరిచి అంగడి సరుకులా కన్నబిడ్డల్ని అమ్మేస్తున్నారు. మగబిడ్డ కోసం ఎదురు చూస్తూ మూడు, నాలుగో కాన్పుల్లోనూ మళ్లీ ఆడపిల్ల పుట్టడం, మరికొందరు పిల్లల్ని పోశించే స్థోమత లేక, ఇంకొందరు డబ్బుల కోసం విక్రయిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించిన తల్లిదండ్రుల తీరు ఆందోళన కలిగిస్తోంది.
మూడు రోజుల క్రితం హవేళిఘణాపూర్ మండలం లింగసాన్‌పల్లి తండాలో మొదటి కాన్పులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులనే సాకుతో రూ. 1.50 లక్షలకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ఇది గమనించిన అంగన్‌వాడీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
శిశుసంరక్షణలో..
గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వాటిలో కేసులు నమోదు చేసి, విక్రయానికి గురైన శిశువులను రప్పించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, 25 మందిని తిరిగి అప్పగించారు. వారిలో ఇద్దరు దంపతులు మాత్రం చిన్నారులను పోషించలేమని శిశు సంరక్షణ కేంద్రంలోనే వదిలేశారు.
పసికందులను విక్రయించిన వారిలో 95 శాతం మంది తల్లిదండ్రులకు చదువు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. నేటి సమాజంలో కూతురు, కొడుకు సమానమనే భావనకు రాకపోవడమే ఇందుకు కారణం. ఆడపిల్లకు కట్నాలు, కానుకలు ఇచ్చి పంపాలనే ఆలోచనతో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఈ వివక్షను పూర్తిగా రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికి చదువుకోవడమే ఏకై క మార్గమని అధికారులు చెబుతున్నారు. శిశు విక్రయాలతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.


