మద్దూరు(హుస్నాబాద్): టీ–ఫైబర్‌కు సంబంధించిన బ్యాటరీలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బ్యాటరీలు, స్విఫ్ట్‌కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్‌ఐ మహ్మద్ అసీఫ్ పీఎస్‌లోకేసు వివరాలు వెల్లండించారు. గత నెల 27న గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి మండలంలోని వల్లంపట్ల గ్రామ పంచాయతీలో ఉన్న 120 ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. టీ–ఫైబర్ కంపెనీకి చెందిన టెక్నీషియన్ చంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కమాన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్త్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైతం 65ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు.
మరో ఘటనలో బైక్ దొంగ..
సిద్దిపేట అర్బన్: బైకును అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. చేర్యాలకు చెందిన శశినాథ్‌రెడ్డి ఫిబ్రవరి 20న నాంచారుపల్లి శివారులోని ఓ దేవాలయం వద్ద తన యూనికాన్ బైకును నిలిపి దర్శనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి బైకు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడి ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన తోటకూరి నరేశ్‌కుమార్‌గా గుర్తించారు. ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. అలాగే వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో కూడా బైకును చోరీ చేశాడు. నిందితుడి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.


