విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ రమేశ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థి దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన కల్గి ఉండాలని, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జెడ్పీహెచ్‌ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో జిల్లా స్థాయి కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు పోస్టర్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ కౌమార దశలో బాల బాలికలకు కలిగే శారీరక, మానసిక, ఉద్వేగపరమైన మార్పుల గురించి అవగాహన కల్పించామని తెలిపారు. హెచ్‌ఐవీ, ఎస్‌టీఐ సంక్రమిత వ్యాధుల నివారణకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పోస్టర్ మేళాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం అధికారి డానియల్, అర్బన్ మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


