సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● హాజరు కానున్న 24,657 మంది విద్యార్థులు

14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● హాజరు కానున్న 24,657 మంది విద్యార్థులు

ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా జిల్లా వ్యాప్తంగా 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌)/

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌

జిల్లాలో 11 ప్రభుత్వ, 197 జిల్లా పరిషత్తు, 17 కేజీబీవీలు, 2 ఎయిడెడ్‌, 10 తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌, 2 టీజీ రెసిడెన్షియల్‌, 12 ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్‌, 11 సోషల్‌ వెల్ఫేర్‌, 6 ట్రైబల్‌, 12 మైనార్టీ రెసిడెన్షియల్‌, 2 ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 201 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి 15,033 మంది విద్యార్థులు, ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి 9,624 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కానున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు మరో 46 మంది ఇతర విద్యార్థులతో కలిపి మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

సీసీ కెమెరాలు

పరీక్షలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే సీల్‌ ఓపెన్‌ చేస్తారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది అంటుబాటులో ఉంచారు.

ఇతర దుస్తుల్లో హాజరు..

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల యూనిఫాంతో కాకుండా ఇతర దుస్తులు ధరించి పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్లోకి మొబైల్‌తోపాటు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాధికారి, డీఈఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ల మొబైల్‌ నంబర్లను డిస్‌ప్లే చేయాలని చెప్పారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి విద్యార్థులకు రవాణ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని ఇదివరకే కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిసిందే.

ప్రశాంతంగా పరీక్ష రాయాలి

విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పది పరీక్షలను పకడ్బందీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవడంతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తమ వెంట తీసుకురాకూడదు. ఏదేమైనా పది పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌.

వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి

123 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 12 మంది రూట్‌ ఆఫీసర్లు, 123 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 123 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 65 మంది కస్టోడియన్స్‌, 6 (బృందాలు) ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 123 సిట్టింగ్‌ స్క్వాడ్‌, 1,300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌, ప్యాడ్‌, పెన్నులు తమ వెంట తెచ్చుకోవాలని వారు తెలిపారు. మీసేవ కేంద్రాలతో పాటుగా 8096958096 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా కూడా హాల్‌టికెట్‌ పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు హాల్‌ టికెట్లపై క్యూర్‌ కోడ్‌ను కూడా ముద్రించారు.

స్వల్ప మార్పులు

పది పరీక్షలు నిర్వహణలో స్వల్ప మార్పులు చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిని కల్పించారు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement