డీహెచ్‌పీఎస్‌కు జిల్లా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

డీహెచ్‌పీఎస్‌కు జిల్లా ఎంపిక

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

● మరింత సమర్థవంతంగా వైద్య సేవలు ● మంత్రి దామోదర రాజనర్సింహ

ఇఫ్తార్‌ విందులో

మాజీమంత్రి హరీశ్‌రావు

పాల్గొన్న ఎమ్మెల్యేలు మాణిక్‌రావు,

చింత ప్రభాకర్‌

● మరింత సమర్థవంతంగా వైద్య సేవలు ● మంత్రి దామోదర రాజనర్సింహ

కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్‌: రాష్ట్రంలో ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్య సేవలను అందించేందుకు డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ వ్యవస్థ (డీహెచ్‌పీఎస్‌)ను అమలు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. డీహెచ్‌పీఎస్‌ను తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కలెక్టరేట్‌లో డీహెచ్‌పీఎస్‌ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లాస్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కందిలో కలెక్టర్‌ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. తర్వాత సీఎస్‌ఆర్‌ నిధులతో మెడికల్‌ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ప్రాజెక్టు అమలులో భాగంగా జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అమలు చేస్తున్నామన్నారు. రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించి, డీహెచ్‌ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారు. డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉండటంతో తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

సబ్సిడీపై యంత్రాల పంపిణీ

రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కొక్కటీ రూ.4.9 లక్షల విలువ చేసే 20 హెచ్‌పీ కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు మంత్రి దామోదర చెప్పారు. రైతులకు పంటల సాగుపై అవగాహన, విద్యారంగంలో పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్‌ పి.ప్రావీణ్య మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రజల కోసమే ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిందన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌ పారిశ్రామిక ప్రాంతం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు గ్రామాలు పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్‌.చొంగ్తూ, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో ఉదయ్‌ కుమార్‌, కలెక్టర్‌ ప్రావీణ్య, తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఫహీం, అదనపు కలెక్టర్‌ పాండు, జెడ్పీసీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి

జహీరాబాద్‌: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్‌విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. యుద్ధం ఇలాగే కొనసాగితే రంజాన్‌ మాసంలో ప్రపంచమంతా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వంటగ్యాస్‌, నూనెలు, నిత్యావసర సరకుల ధరలు పెరిగి పోయాయన్నారు. యుద్ధం ముగియాలని పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా అల్లాను ప్రార్థించా లని కోరారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్‌ తోఫాలు అందజేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. గత రెండు బడ్జెట్‌లలో ముస్లింలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఈ బడ్జెట్‌లో అయినా రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. కల్యాణలక్ష్మి–షాదీముబారక్‌ కింద ఇచ్చిన మాట ప్రకారం రూ.1.60లక్షలు అందజేయాలని కోరా రు. సమావేశంలో ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింత ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై.నరోత్తం, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిలర్‌ గౌస్‌గౌరి వితంతువులకు ప్రతి నెలా రూ.500 వంతున పింఛన్‌ చెల్లింపులను హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement