జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ,సఖి కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలను గౌరవించాలని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయపరమైన విషయంలో ఉచితన్యాయ సహాయం కోసం కోర్టును సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సేవకులుగా ఎదగండి
జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
పటాన్‌చెరు: ఏదైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు స్వీయ రక్షణతోపాటు తోటి పౌరులను రక్షించడం కోసం వారం రోజుల శిక్షణ తరగతులను గీతం విద్యార్థులకు అందజేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛంద సేవకులుగా ఎదగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సౌజన్యంతో వారం రోజుల ‘పౌర రక్షణ స్వచ్ఛంద శిక్షణ సామర్థ్య నిర్మాణం’కార్యక్రమాన్ని గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మతో కలిసి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ శిక్షణలో అగ్నిప్రమాదాలు, విమాన, రసాయన, అణు విస్పోటనం, వరదలు, భవన సముదాయాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపకాధికారి భిక్షపతి, ఎస్టేట్ అధికారులు డీవీఏ మోహన్ ఇతర అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్ఫూర్తి డిగ్రీ కళాశాల
గుర్తింపు రద్దు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్స్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న స్ఫూర్తి డిగ్రీ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, సతీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ...జిల్లా కేంద్రంలో ఉన్న స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తరగతులు బోధించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. విద్యార్థులే స్వయంగా యూట్యూబ్‌లో టాపిక్ సెర్చ్ చేసుకుని క్లాసెస్ వింటున్న పరిస్థితి ఉందన్నారు. వెంటనే కాలేజీ గుర్తింపును రద్దు చేయని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తాం. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వేతో భూసమస్యలు దూరం
సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్: రీ సర్వేతో భూసమస్యలు దూరమవుతాయని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. ఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామంలో భూ భారతి రీసర్వేలో భాగంగా గురువారం గ్రామసభను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ...రీ సర్వేలో భూముల హద్దులు నిర్ధారణ అయ్యి భూసమస్యలకు అవకాశం ఉండదన్నారు. రైతులు, గ్రామస్తులు రీసర్వేకు సహకరించాలని కోరారు.


