కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు
సంగారెడ్డి: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో చింత ప్రభాకర్, మాణిక్ రావు కలెక్టర్‌ను కలసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అరుట్ల, రాజంపేట్, సదాశివపేట, పెద్దాపూర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా బోర్‌వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. చిమ్నాపూర్ గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భవన నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్‌కు వివరించారు. సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి బైపాస్‌లో నిర్మాణంలో ఉన్న 80 అడుగుల రోడ్డు పనులు నాణ్యత లేకుండా నిదానంగా సాగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.44 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీలో రూ.8.50 కోట్లతో అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. బేగంపేట్ గ్రామంలో వాటర్ ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, స్థానిక సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్...విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
మరో రూ.2 కోట్లు మంజూరు చేయండి
సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న మినీ హజ్ హౌస్ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు కోరారు. హనుమాన్ నగర్‌లో ముస్లిం, క్రిస్టియన్ సమాధుల కోసం కేటాయించిన స్థలంలో సరైన వసతులు లేవని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.


