జిన్నారం రెవెన్యూ పరిధికి సంబంధించిన సర్వే నంబర్ 181లోని దాదాపు 3 ఎకరాల భూములపై అక్రమార్కుల కన్ను పడింది. సమీపంలోనే అవుటర్ రింగ్ రోడ్డు ఉండటంతో పక్కా పథకం ప్రకారం అక్రమార్కులు నిర్మాణాలకు తెర తీశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మామూళ్లకు అలవాటు పడిన అధికార యంత్రాంగం అక్రమార్కులకు భూములను కట్టబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే బుధవారం కొన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతన అధికారులు చేపట్టినా ఆ చర్యలను స్థానికులు నమ్మే పరిస్థితి లేదు. కేవలం అనుమానించకుండా ఉండేందుకే ఇటువంటి తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు.


