రాయికోడ్(అందోల్): పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం గ్రామాల్లోని గృహావసరాల గ్యాస్ సరఫరాపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం గృహావసరాలకు సిలిండర్‌ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో వినియోగదారులకు తిప్పలు తప్పడంలేదు. మండలంలో సుమారు 9 వేల గృహ వినియోగదారులుండగా రోజుకు 120 సిలిండర్లు వినియోగమవుతున్నాయి. గతంలో ఆర్డర్ పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో సిలిండర్ లారీ లోడ్ వచ్చేది. అయితే యుద్ధం నేపథ్యంలో ఆర్డర్ పెట్టిన ఐదారు రోజులకు ఒక లోడ్ సరఫరా చేస్తున్నారని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.925 నుంచి రూ.985కు పెరగడం ఆర్థికంగా భారమవగా స్టాక్ లేకపోవడంతో నిరీక్షణ తప్పడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.


