● లిక్కర్ బాటిల్ క్యూఆర్ కోడ్‌తోనిందితుల గుర్తింపు ● 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
మెదక్ అర్బన్: వివాహేతర సంబంధం, వ్యసనాలు ఓ మహిళ హత్యకు దారి తీశాయి. సంఘటనా స్థలిలో లభించిన మద్యం సీసా క్యూఆర్ కోడ్‌తో వేట కొనసాగించిన పోలీసులు కేసును ఛేదించారు. సులోచన హత్య కేసులో నిందితులైన కొమ్మట రాజు, బానోతు భూలి ఎలియాస్ రేణను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాపన్నపేట మండలంలోని కొడుపాకకు చెందిన బేగరి సులోచన (35) భర్త దుర్గయ్య గత కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం ఆమె మెదక్ వెళ్లి కూలీ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో నిజాంపేట మండలం నగరం(నస్కల్) గ్రామానికి చెందిన కొమ్మట రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాజుకు నగరం తండాకు చెందిన బానోతు బూలి ఎలియాస్ రేణతో కూడా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల సులోచన నడవడికపై అనుమానం పెంచుకున్న రాజు, తరచుగా ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి, రాజు, రేణలు ఈనెల 9న సులోచనను మెదక్ నుంచి ఏడుపాయలలోని చెలిమలకుంట వద్దకు తీసుకెళ్లారు. వెళ్లేటప్పుడు నాగ్సాన్‌పల్లి కమాన్ వద్ద వైన్స్‌లో రెండు క్వార్టర్లు, రెండు బీర్లు తీసుకెళ్లి అక్కడ తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరిగి సులోచనను రాజు కర్రతో బలంగా కొట్టగా, రేణ ఆమె కాళ్లు కదలకుండా పట్టుకుంది. సులోచన చనిపోగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాల తీసుకొని పరారయ్యారు. కాగా విచారణ ప్రారంభించిన పోలీసులు అక్కడ లభించిన మద్యం సీసాల క్యూఆర్ కోడ్ ఆధారంగా నాగ్సాన్‌పల్లి కమాన్ వైన్స్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.


