సిద్దిపేటఅర్బన్: దాయాదులతో భూ వివాదంలో తలెత్తిన గొడవలో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతున్న నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో సీఐ వివరాలు వెల్లడించారు. పొన్నాల గ్రామానికి చెందిన మక్కల కనకయ్య, మక్కల శేఖర్, మక్కల లక్ష్మి తమ దాయాదులతో భూమి విషయంలో గొడవపడి దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఈ విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు విధించడంతో కరీంనగర్ జైలుకు పంపించినట్టు తెలిపారు.
సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): పట్టణంలోని మొబైల్ షాపులో సెల్ ఫోన్లు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమేశ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం స్థానిక గాంధీ సెంటర్ వద్ద గల మొబైల్ షాప్‌లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కొమురవెల్లి ఎస్‌ఐ మహేష్ పెట్రోలింగ్ చేస్తుండగా బస్టాండ్ వద్ద ఏపీ అనంతపురం జిల్లా కదిరికి చెందిన పోతుల శివకుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొబైల్ షాప్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అతని వద్ద మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
శివ్వంపేట(నర్సాపూర్): బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9 సంవత్సరాల బాలిక మంగళవారం రాత్రి గ్రామంలో నిర్వహిస్తున్న సర్కస్ చూడడానికి వెళ్లగా ఓ యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


