హెచ్‌ఓడీని శిక్షించాలి
హత్నూర(సంగారెడ్డి): 15 మంది సీఎస్సీ విద్యార్థులపై దాడి చేసిన హెచ్‌ఓడీ, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి బుధవారం ఆందోళన చేశారు. హత్నూర మండలం తురకల ఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సీఎస్సీ చదువుతున్న ఫస్టియర్ విద్యార్థులు 15 మందిపై మంగళవారం విచక్షణారహితంగా హెచ్‌ఓడీ అధ్యాపకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, సీఐటీ యూ నాయకులు కళాశాల గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై దాడి చేసిన హెచ్‌ఓడీతోపాటు యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గతంలో కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అధ్యాపకులు తరచూ విద్యార్థులపై దాడులు చేయడం ఈ కళాశాలలో సాధారణమైపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నారం సీఐ రమణారెడ్డి, ఎస్సై శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సిబ్బందిని పిలిపించి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడించారు. విద్యార్థులపై దాడి చేసిన శివారెడ్డిని కళాశాల నుంచి ఎండీ సస్పెండ్ చేశారు. గాయాలపాలైన విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు. ఆందోళనలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు సాయికుమార్, ఎన్‌ఎస్‌వీఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేశ్, సీఐటీయూ నాయకులు శేఖర్, పలు గ్రామాల సర్పంచులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


