సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం తరగతి బోధనకే పరిమితం కాకుండా ఆచరణాత్మక, మార్కెట్ ఆధారిత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) కామర్స్ విభాగం బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ పాట్రిక్ ఆంథోని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రాజెక్టుల నివేదికల తయారీపై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ స్థాయిలో ప్రాజెక్టుల తయారీ ఒక ముఖ్య విషయంగా ఉండటం విద్యార్థుల భవిష్యత్ కార్యచరణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడం, సూక్ష్మ పరిశీలన చేయడం, పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అనేక నైపుణ్యాలు పెంపుందుతాయన్నారు. అనుభవజ్ఞులైన ఆచార్యుల పర్యవేక్షణలో ప్రాజెక్టులు తయారు చేస్తే భవిష్యత్‌లో నిర్మాణాత్మక పరిశోధనలకు ఉపయోగపడుతాయని చెప్పారు. ప్రాజెక్టు ఆంశాలను ఎంచుకునేప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటయాన్నారు. సమాజంలోని మౌలిక సమస్యలు, జీవన ప్రమాణాలు, ఉత్పాదకతను పెంపొందించే ప్రాజెక్టులు తయారు చేస్తే పారిశ్రామిక రంగంలో మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత విద్యార్థులకు ఉపయుక్తమైన కార్యక్రమాలను నిర్వహించడంలో కామర్స్ విభాగం ముందుంటుందని అభినందించారు. కార్యక్రమ సమన్వయకర్త, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాలసుదర్శనం వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, చర్చించే విషయాలు, శాస్త్ర సాంకేతిక మేళవింపు తదితర అంశాలను గూర్చి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఆయా విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఓయూ బోర్డ్‌ఆఫ్ స్టడీస్‌చైర్మన్ పాట్రిక్ ఆంథోని
డిగ్రీ కళాశాలలో ప్రాజెక్టులనివేదికలపై వర్క్‌షాప్


