దుబ్బాక: పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం వీరనగర్ వద్ద రోడ్డెక్కి రెండుగంటలకు పైగా రస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాయపోల్ ఎస్‌ఐ మానస రైతులకు ఆందోళన విరమించాలని ఎంతగా నచ్చజెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని ఎస్‌ఐ కచ్చితమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాసంగిలో సాగునీళ్లు విడుస్తారన్న ఆశతో పంటలు వేసుకుంటే ఇంత వరకు నీళ్లు విడవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కాలువ ద్వార వస్తున్న నీటిని తమ గ్రామాల చెరువులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి సర్పంచ్ స్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ స్వామి, ఆయా గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.


