హత్నూర(సంగారెడ్డి): హోంవర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థులపై హెచ్‌ఓడీ చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మండలంలోని తురకల ఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చోటు చేసుకుంది. వివరాలు... కళాశాలలో సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను హోంవర్క్ చేయలేదని సుమారు 15 మందిని ఇష్టం వచ్చినట్లు హెచ్‌ఓడీ శివారెడ్డి కొట్టడంతో తీవ్ర గాయాలయ్యియి. హోంవర్క్ చేయలేదన్న సాకుతో హెచ్‌ఓడీ కేబుల్ వైర్‌తో విద్యార్థులను కొట్టారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రత్నపురి విద్యాసంస్థల ప్రతినిధి రఘును సాక్షి వివరణ కోరగా విద్యార్థులపై దాడి చేయడం విచారకరమని తెలిపారు. విద్యార్థులను కొట్టిన హెచ్‌ఓడీపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.


