జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై రూ.11 కోట్లతో నిర్మించిన దుకాణాల సముదాయం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కాంట్రాక్టర్‌కు రూ.5.50 కోట్ల బిల్లులు చెల్లించే విషయంలో జాప్యమే ఇందుకు కారణం. వినియోగంలోకి తెచ్చి వ్యాపారాలు నిర్వహించుకునేలా మంత్రి దామోదర రెండేళ్ల క్రితం సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి బకాయిలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ చెల్లించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
– జహీరాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 23 ఫిబ్రవరి 2024లో మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక మున్సిపల్ సమీక్ష సమావేశానికి హాజరవ్వగా దుకాణాల సముదాయం అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కాంట్రాక్టర్ జావీద్‌అలీని పిలిపించి చర్చించారు. బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కాంట్రాక్టర్ వద్ద నుంచి దుకా ణ సముదాయానికి సంబంధించిన తాళం చెవిలను అప్పటి కలెక్టర్ వల్లూరి క్రాంతికి అప్పగించారు. దీంతో సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. కానీ, బకాయిల చెల్లింపుల హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు వాపోతున్నారు.
రూ.11 కోట్లతో నిర్మాణం
జహీరాబాద్ పట్టణంలోని సుభాష్‌గంజ్‌లో రూ.11 కోట్ల వ్యయంతో దుకాణాల సముదాయం నిర్మించారు. భవనాన్ని అప్పటి మంత్రి హరీశ్‌రావు 2022 డిసెంబర్‌లో ప్రారంభించారు. వేలం ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. అయినా ఇప్పటి వరకు సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్, కమర్షియల్ కాంప్లెక్సు వినియోగంలోకి రాలేదు. అటు వ్యాపారులకు ఎదురు చూపు తప్పక పోగా ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు వ్యాపారాల నిర్వహణకు దుకాణాల కొరత తీర్చడం కోసం సముదాయం నిర్మించారు. కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలతో పాటు ప్రధాన వ్యాపారాలన్నీ ఒకే దగ్గర నిర్వహించేలా గ్రౌండ్ ఫ్లోర్‌లో 33 దుకాణాలు, మొదటి అంతస్తులో 34 దుకాణాలను నిర్మించారు. సెల్లార్‌లో వెజ్, నాన్‌వెజ్ వ్యాపారాల కోసం 84 స్టాళ్లు నిర్మించారు.
బిల్లులు చెల్లించకపోవడంతో..
రూ.5.50 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు, రూ.4.50 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులు, రూ.కోటి పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఈ నిధుల్లో నుంచి రూ.5.50 కోట్ల నిధులు మాత్రమే కాంట్రాక్టర్‌కు చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ వేచి చూసి విధిలేక తిరిగి దుకాణాల సముదాయం తాళం చెవిలు వెనక్కి తీసుకున్నారు. 53 దుకాణాలను 2023 ఫిబ్రవరి 8న వేలం ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. కానీ, బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించకపోవడంతో కేటాయింపులు నిలిచిపోయాయి.
మూతపడిన గ్రౌండ్‌ఫ్లోర్ దుకాణాలు
నిరుపయోగంగా భవన సముదాయం
బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం కాంట్రాక్టర్ ఆధీనంలో భవనం
మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లు.! రోడ్డుపైనే కొనసాగుతున్న వ్యాపారాలు
రోడ్డుపైనే వ్యాపారాలు
కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుండటంతో దుకాణాల సముదాయం నిరుపయోగంగా మారింది. మొదటి ఫ్లోర్ తాళాలను కాంట్రాక్టర్ తన వద్ద పెట్టుకున్నారు. సెల్లార్‌ను అప్పగించినా వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించడం లేదు. రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్యను పరిష్కరించి, ట్రాఫిక్ లేకుండా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


