వెయ్యి కోట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్లు కేటాయించాలి

Mar 11 2026 8:36 AM | Updated on Mar 11 2026 8:36 AM

హుస్నాబాద్‌: తెలంగాణ విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీలకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ బడ్జెట్‌ను కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొవిటి సదానంద చారి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కో ఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. సొసైటీల ద్వారా విశ్వబ్రాహ్మణులకు ఉపాధి, వృత్తి పరంగా ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, నాయకులు కిరణ్‌ కుమార్‌, రాజ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, కవిత ఉన్నారు.

భారీ ఇసుక డంప్‌ సీజ్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. వివరాలు ఇలా... విశ్వసనీయ సమాచారం మేరకు తహసీల్దార్‌ శ్రీనివాస్‌, గిర్దావర్‌ నర్సింగ్‌యాదవ్‌ మండలంలోని ఉప్పులింగాపూర్‌ గ్రామ శివారులో నిల్వ ఉంచిన సుమారు 50 ట్రాక్టర్‌ల ఇసుకను సీజ్‌ చేసి, స్వాధీనం చేసుకున్నారు. హల్దీవాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించడం నేరమని, ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని తహసీల్దార్‌ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రెండు లక్షలకు పైగా ఉంటుందని, త్వరలోనే వేలం వేయనున్నట్లు తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం

గజ్వేల్‌రూరల్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని పిడిచెడ్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సందమైన జ్యోతి కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి సామగ్రి కాలిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న వారు మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 10లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాఽధితురాలు తెలిపింది.

ఆలయంలో చోరీ..

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఆలయం తాళాలు పగులగొట్టి దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రామచంద్రాపురం పట్టణంలో చోటు చేసుకుంది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కథనం ప్రకారం... పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి పరిశీలించగా ఆరు తులాల బంగారు ఆభరణాలు, సుమారు ఎనిమిది కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగలు హుండీని సైతం పగులగొట్టారు. కాగా ఆలయ ప్రాంగణంలో రూ.90వేల నగదు లభించింది. క్లూస్‌ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు.

మొబైల్‌ షాపులో..

చేర్యాల(సిద్దిపేట): మొబైల్‌ షాపులో ఫోన్లు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని గాంధీ సెంటర్‌ సమీపంలో బింగి భాస్కర్‌ మొబైల్స్‌ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసి వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం వచ్చి చూడగా షాపులో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సుమారు రూ.40 వేల విలువైన ఫోన్లు చోరీ చేశారని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement