చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులోని బంగారమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన నారెడ్డి మోహన్‌రెడ్డి(52) హైదరాబాద్‌లో సొంత ఇళ్లు ఉంది. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మోహన్‌రెడ్డితో పాటు సమీప బంధువులైన తిరుపతి, రఘుపతిరెడ్డి కారులో కామారెడ్డికి వస్తున్నారు. మాసాయిపేట శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మిగితా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
పాలు పితకడానికి వెళ్తుండగా..
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రవీంద్రనగర్‌కు చెందిన కోడెల నర్సయ్య (59) బావి వద్ద పాలు పితకడానికి కాలినడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో గజ్వేల్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న టాటా ఏసీ ట్రాలీ ఆటో డ్రైవరు అజాగ్రత్తగా వాహనం నడుపుతూ నర్సయ్యను వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆయన వాహనం ముందర టైర్ల మధ్యలో ఇరుక్కుని అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవరు తోపుల లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో..
పాపన్నపేట(మెదక్): పాపన్నపేటకు చెందిన ఆరె కటికె మోహన్ మంగళవారం మేకలు కోసేందుకు ఏడుపాయలకు వెళ్లాడు. తిరిగి ఆటోపై ఇంటికి వస్తుండగా పాపన్నపేట శివారులోని మాలగుట్ట వద్ద ఆటో ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో మోహన్(60) కాలు తెగిపడింది. వెంటనే అతన్ని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మరో ఇద్దరికి సైతం స్వల్ప గాయాలయ్యాయి.


