మెదక్ కలెక్టరేట్: మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులతో నెల పసికందును సొంత తల్లిదండ్రులే విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మెదక్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. హవేళిఘణాపూర్ మండలం లింగ్సాన్‌పల్లి తండాకు చెందిన కేతావత్ మహేశ్ మొదటి భార్యను వదిలేసి ఏడాది క్రితం మంజులను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం ఒక మగశిశువు జన్మించాడు. కాగా ఆర్థిక ఇబ్బందులకుతోడు, మహేశ్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం శిశువును మధ్యవర్తి నాగరాజు ద్వారా కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన రాజు – రజిత దంపతులకు రూ.1.50 వేలకు విక్రయించారు. ఇందుకు సంబంధించి బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు. కాగా శిశువు తల్లి మంజుల అంగన్‌వాడీ కేంద్రానికి పాలకు, పౌష్టికాహారం కోసం రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వారి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. వెంటనే విషయాన్ని ఐసీడీఎస్ సెక్టార్ ఇన్‌చార్జ్ విజయలక్ష్మికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హవేళిఘణాపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ విచారణ చేపట్టి కంచర్లకు వెళ్లి శిశువును తీసుకొచ్చి మెదక్‌లోని సఖీ సెంటర్‌లో తల్లి మంజులకు అప్పగించారు. శిశువు అమ్మిన తల్లిదండ్రులు, మధ్యవర్తిగా వ్యవహరించిన నాగరాజు, కొన్నవారిపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.
పసికందును విక్రయించిన తల్లిదండ్రులు
వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ


