కొల్చారం(నర్సాపూర్): సీసీ కెమెరాలతో ప్రజల భద్రత బలోపేతం అవుతుందని, నేరాల నియంత్రణకు దోహదం చేస్తాయని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు ఏడుపాయల టీ జంక్షన్ నుంచి రెండవ బ్రిడ్జి వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే వాహనాలు, ప్రజల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించనున్న ట్లు తెలిపారు. ప్రజలు కూడా శాంతి భద్రతలు కాపాడటంలో భాగస్వాములు కావాల న్నారు. మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్, చిన్నఘనాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, యాదగిరి ఉన్నారు.
తూప్రాన్: లేగదూడపై చిరుతలు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన మండలంలోని గుండ్రేడ్డిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చింతల శేఖర్ తన పొలం వద్ద పశువులను పాకలో ఉంచాడు. మంగళవారం ఉదయం వెళ్లి చూడగా లేగ దూడ కళేబరం కనిపించడంతో ఖంగుతిన్నాడు. ఇటీవల గ్రామ సమీపంలో రెండు చిరుతలు సంచరిస్తున్న విషయం తెలిసిందే. చిరుతల దాడిలోనే లేగదూడ చనిపోయిందని డివిజన్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ చిరంజీవికి సమాచారం అందించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టంలో చిరుత దాడిలోనే చనిపోయినట్లు గుర్తించారు.
సీసీ కెమెరాలతో భద్రత బలోపేతం: జిల్లా ఎస్పీ