పాపన్నపేట(మెదక్): కూలీ పనులకు వెళ్లిన మహిళ శవమైంది. వివరాలు ఇలా.. మండలంలోని కొడుపాకకు చెందిన బేగరి సులోచన (35)భర్త దుర్గయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు కుమారుడు రాజేశ్ ఉన్నాడు. సోమవారం ఆమె పని కోసం మెదక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కొడుకు బంధువులకు సమాచారం అందించాడు. కాగా మంగళవారం ఏడుపాయల్లోని చెలిమల కుంట వద్ద, గుర్తు తెలియని మహిళ శవం ఉందన్న సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయి. ఆమె సెల్‌ఫోన్, సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని నార్సింగిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దారబోయిన క్రిష్ణకు , హవేలిఘనపూర్ మండలం ముత్తాయికోటకు చెందిన మాధవి(27)ని ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు. కాగా కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం క్రిష్ణ మందు చల్లేందుకు పొలానికి వెళ్లాడు. అత్త మనవడిని తీసుకొని పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవి ఉరివేసుకుంది. ఇంటికి వచ్చి చూసిన అత్త వెంటనే కొడుకుకు చెప్పింది. కాగా మాధవి తరపు వారు వచ్చి గొడవకు దిగారు. ఎస్సై సంఘటనా స్థలికి వెళ్లి నచ్చజెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


