గజ్వేల్: మహిళల అభివృద్ధిని అడ్డుకుంటే సమాజానికే నష్టం వాటిల్లుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి రజిని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సామాజిక గమనం–మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై గజ్వేల్‌లోని ఓ గార్డెన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రజిని మాట్లాడుతూ .. సరైన గౌరవం దక్కకపోతే మహిళలు అసహనం ప్రదర్శించి తిరుగుబాటు కూడా చేస్తారనే సంకేతాన్ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా మహిళ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న మహిళలు గ్రామాల్లో సామాజిక అంశాలపై పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే.విరాహత్ అలీ పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి, ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంబదాస్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్ స్వప్న పాల్గొన్నారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి రజిని


