● హెచ్‌ఎం, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిక
పటాన్‌చెరు టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇస్నాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్, డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు రివిజన్ చేస్తున్నారా అని అని అడిగారు. ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్యూల్ సరిగా అమలు కావడం లేదని గుర్తించిన కలెక్టర్.. సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గుడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరవడంపై, అలాగే.. పర్యవేక్షణ లోపించినందుకు ఎంఈఓకు కూడా షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డైనింగ్ హాలు సరిగా శుభ్రం చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు
అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. అక్కడ మంటలు చెలరేగిన ప్రాంతాన్ని 24 గంటల్లో వాటర్ ట్యాంకర్ల సహాయంతో పూర్తిగా ఆర్పివేయాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమంగా చెత్త వేయకుండా పర్యవేక్షణ ఉండేలా ఒక కార్మికుడిని నియమించాలని చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్ రావు, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


