3 నెలల రేషన్‌ ముందుగానే.. | - | Sakshi
Sakshi News home page

3 నెలల రేషన్‌ ముందుగానే..

Mar 9 2026 9:26 AM | Updated on Mar 9 2026 9:26 AM

● వేసవి నేపథ్యంలో ఏప్రిల్‌లో పంపిణీ ● డీలర్లకు సరుకుల నిల్వ సమస్య ● జిల్లాలో 4,13,031 ఆహారభద్రత కార్డులు

● వేసవి నేపథ్యంలో ఏప్రిల్‌లో పంపిణీ ● డీలర్లకు సరుకుల నిల్వ సమస్య ● జిల్లాలో 4,13,031 ఆహారభద్రత కార్డులు

నారాయణఖేడ్‌: రేషన్‌ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే నెలలో వేసవికి సంబంధించి మూడు నెలల బియ్యం అందనుంది. ఈనెలకు సంబంధించి బియ్యం పంపిణీ కొనసాగుతుంది. కాగా ఏప్రిల్‌ నెలలో ఆనెల కోటాతోపాటు మే, జూన్‌ నెలలకు సంబంధించి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఒక్కో లబ్ధిదారుకు

ఆరు కిలోలు చొప్పున పంపిణీ

జిల్లాలో ఆహార భద్రత కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) కార్డులు 4,13,031 కాగా వీటిలో లబ్ధిదారులు 14,12,138, వీరికి ఒక్కొక్కరికి 6కిలో చొప్పున ప్రతీనెల 84,72,828 కిలోల బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కింద 26,671 కార్డులు కాగా ఒకరికి 35కిలో చొప్పున 68,537 మంది లబ్ధిదారులకు 9,33,485కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డులు 93 కాగా ఇందులో 95మంది లబ్ధిదారులకు 910కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల కార్డులు 4.39,795 కాగా వీరందరికీ 9,407.243 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ లెక్కన కార్డులోని లబ్ధిదారుల సంఖ్య అనుగుణంగా ఒకేసారి మూడునెలల బియ్యం అందజేయనున్నారు.

తలెత్తనున్న నిల్వ ఇబ్బందులు

రబీ సీజన్‌ కొనుగోళ్ల వల్ల గోడౌన్లలో బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం పంపిణీ వల్ల నిల్వల సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రసుత్తం గోడౌన్లలోంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వలను లిఫ్ట్‌ చేసి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా గోడౌన్ల ఖాళీ వల్ల రబీ సీజన్‌ బియ్యం ఇతర నిత్యావసరాల కొనుగోళ్లు చేపట్టి నిల్వ చేసే సమస్య తీరనుంది.

వేసవి ఇబ్బందులూ పరిష్కారం

ఈసారి వేసవిలో ఎండలు మండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నాయి. ఎండలు, వాటికి తోడు వేడిగాలులతో జనాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దీంతో మూడునెలలకు సంబంధించి సరుకులు ఒకేసారి పంపిణీ చేయడం వల్ల జనాలు వేసవిలో రేషన్‌ దుకాణాల ముందు గంటల తరబడి క్యూకట్టి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు.

సరుకుల భద్రం సమస్యే

వానాకాలంలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సమయంలో రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టాక్‌ భద్రపర్చేందుకు సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. డీలర్లకు రవాణ ఖర్చులు తగ్గడం, హమాలీ పనిభారం తగ్గడం వంటి అనుకూలతలున్నా స్టాక్‌ భద్రపర్చడం సమస్యగా మారే అవకాశముంది. బయో మెట్రిక్‌ విధానంలో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ–పాస్‌ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాలి. సర్వర్‌ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడా నికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు మూడు వారాలపాటు రేషన్‌ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement