జహీరాబాద్‌కు బుల్లెట్ రైలు
అక్కడి నుంచి ముంబైకి.. రైల్వే బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్ గంటకు 320 కిలోమీటర్ల వేగం తీరనున్న ప్రయాణికుల కోరిక
జహీరాబాద్: జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్వే బడ్జెట్‌లో మరోమారు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు అంశం పెండింగ్‌లో ఉండిపోయింది. తాజా రైల్వేబడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే డీపీఆర్‌ను పూర్తి చేసుకున్న హైదరాబాద్–ముంబై ప్రాజెక్టును రెండుగా విభజన చేశారు. గతంలో హైదరాబాద్–ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్‌గా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్–పూణె, పూణె–ముంబైగా మార్చారు. ఆయా రైల్వే స్టేషన్ల మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్‌ను నిర్మించనున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 11 స్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు ప్రతిపాదించారు. అందులో భాగంగా హైదరాబాద్, జహీరాబాద్, కల్‌బుర్గి, షోలాపూర్, పండరిపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కంప్లెక్సు, బాంద్రా, ముంబై ష్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది.
తగ్గనున్న ప్రయాణం వ్యవధి
కొత్త కారిడార్ మూలంగా ప్రయాణ వ్యవధి తగ్గనుంది. హైదరాబాద్ నుంచి పుణెకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా రెండు గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ముంబైకి 14 గంటల సమయం పడుతుండగా.. హై స్పీడ్ రైలు మూలంగా కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలు గరిష్ట వేగం 350 కి.మీ సామర్థ్యం కాగా, ఆపరేషనల్ వేగం 320 కి.మీ ఉంటుంది. ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్‌తో కలిపి కారిడార్ ఉంటుంది. ఈ రైలులో 750 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే వీలుంటుంది.
ఇంజనీరింగ్ సర్వే
ఇప్పటికే రైల్వేలైన్ నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. అవసరమైన చోట మట్టి పరీక్షలు చేసి ప్రాథమిక నివేదికలను సైతం ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖకు అందజేశారు.
హైదరాబాద్ నుంచి పూణెకు..
పారిశ్రామిక ప్రాంతంగా జహీరాబాద్
జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో మహీంద్ర, హట్సన్, పిరామల్, అల్లానా లాంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. అంతే కాకుండా 12,650 ఎకరాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఇందు కోసం ఆరువేల ఎకరాల మేర భూ సేకరణ జరిగింది. నిమ్జ్‌కు అనుసంధానంగా 165,161 జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ సైతం ఉంది. బుల్లెట్ రైలు రాకతో జహీరాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు పర్యటించే ప్రయాణికులకు ఈ రైలు వల్ల ఎంతో సౌకర్యం కలగనుంది. ప్రాజెక్టు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


