హైడ్రా పేరిట బెదిరిస్తే మూల్యం తప్పదు | - | Sakshi
Sakshi News home page

హైడ్రా పేరిట బెదిరిస్తే మూల్యం తప్పదు

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

హైడ్రా పేరిట బెదిరిస్తే మూల్యం తప్పదు

హైడ్రా పేరిట బెదిరిస్తే మూల్యం తప్పదు

సంగారెడ్డి చైర్మన్‌ పీఠం కై వసం చేసుకుంటామని ధీమా

సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి సంగారెడ్డిలోని నాల్సాబ్‌ గడ్డ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో హైడ్రా సంగతేమిటో తేలుస్తానని చెప్పారు. ‘హైడ్రాకా బాప్‌ అసదుద్దీన్‌ హై’అని చెప్పారు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హైడ్రా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందని, గెలిచిన, ఓడిన వారు పరేషాన్‌లో ఉన్నారని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని ఆ రెండు పార్టీలు విస్మరించాయని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఎంఐఎం అని పేర్కొన్నారు. మాది లౌకిక పార్టీ అని చెబుతూ.. ఏ పార్టీకి లొంగని ఏకై క పార్టీ కూడా ఎంఐఎం అని ఒవైసీ చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరు హామీల పేరుతో తమ దగ్గరికి వచ్చినప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని, కానీ ఓ సందర్భంలో ఆ పార్టీ నేత షబ్బీఅలీ ఎంఐఎం బీజేపీ ఒకటేనని అనడం బాధాకరమన్నారు. సంగారెడ్డిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. సంగారెడ్డిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠం కై వసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్నారు. ఎంఐఎం వార్డులలో అభివృద్ధి చేసి చూపించామని, తమ పార్టీ అభ్యర్థులు లేని వార్డులు ఏ విధంగా ఉన్నాయో సంగారెడ్డి ప్రజలు గమనించాలని కోరారు. ఎవరు గెలిస్తే సంగారెడ్డి మున్సిపాలిటీ బాగుపడుతుందని, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. మొత్తం 38 వార్డులకు గాను 13 వార్డుల్లో బరిలో దిగిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సంగారెడ్డి బల్దియా పీఠం లేదా వైస్‌ చైర్మన్‌ కుర్చీ దక్కించుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సభలో కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహిద్దీన్‌, నాననగర్‌ కార్పొరేటర్‌ నాసిరొద్దీన్‌, జిల్లా అధ్యక్షులు నిజమొద్దీన్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ ఫాజిల్‌ ఇర్ఫాన్‌, మాజీ కౌన్సిలర్లు ఆరిఫ్‌, యాకూబ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement