చేతులెత్తేశారు? | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు?

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

చేతులెత్తేశారు?

చేతులెత్తేశారు?

తలనొప్పిగా మారిన ఉపసంహరణలు ఇరు పార్టీల్లో జాబితాల పేర్లు మార్పు పూర్తి స్థాయిలో వెల్లడికాని పేర్లు అనుయాయులకే బీ ఫారాలు తిరుగుబాటు అభ్యర్థుల బెడదా తప్పదా?

జహీరాబాద్‌: మున్సిపల్‌ నామినేషన్ల ఉపసంహరణకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నా.. జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీలకు సంబంధించి ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాలను వెల్లడించలేదు. దీంతో టికెట్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు నిరాశలో మునిగి తేలుతున్నారు. జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీలకు సంబంధించి టికెట్ల కేటాయింపులు, బీ ఫాం కేటాయించే విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రాధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో గందర గోళం నెలకొంది. దీంతో కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వ హించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి అజహరుద్దీన్‌, ఐడీసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌షెట్కార్‌ బీ ఫాంలను అందజేశారు. జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫాంలను సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌లకు అప్పగించారు. ఇరువురు కలిసి బీ ఫారాలను అధిష్టానం గుర్తించిన అభ్యర్థులకు కేటాయించనున్నారు. సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రావాల్సిందిగా అధిష్టానవర్గం వారికి బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది.

జాబితాల్లో పేర్లు మార్పు

కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు విడుదల చేసిన జాబితాల్లో మూడు సార్లు అభ్యర్థుల మార్పులు చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ప్రజల్లో నుంచి అభ్యంతరాలు రావడంతో మార్పులు చేసినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి టికెట్లు కేటాయించారనే ఆరోపణలు పార్టీ కార్యకర్తలు అధిష్టానం ముందు ఉంచారు. చివరి నిమిషంలో సీఎం పేషీ నుంచి వచ్చిన సూచన మేరకు ఒకరి పేరును మార్పు చేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ మాత్రం సోమవారం ఒకరి అభ్యర్థిత్వాన్ని మార్పు చేసింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాక పోవడంతో బీఆర్‌ఎస్‌లో టికెట్‌ సంపాదించినట్లు సమాచారం. దీంతో 2వ వార్డు నుంచి మణెమ్మకు బదులుగా విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. బీజీపీ సైతం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఉండడంతో అధిష్టానవర్గం నిర్ణయించిన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ ఫారాలను అందించనున్నాయి.

తలనొప్పిగా మారిన ఉపసంహరణలు

ప్రధాన పార్టీల టికెట్లను ఆశించిన పలువురు ఆయా పార్టీల పేరిట నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో బీ ఫాం లభించని వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటారా అనే సందేహాలు ఆయా పార్టీల నేతలను వెంటాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement