ఆరు దశాబ్దాలు
1978 నుంచి
ప్రత్యక్ష పద్ధతిలో..
పంచాయతీ పాలనకు
పరిషత్ వ్యవస్థ
●1964లో తొలిసారి ఎన్నికలు ●మొదట్లో పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నిక
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. మండలంలో 38 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీమైన విషయం తెలిసిందే. మిగిలిన 35 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా అందులో గుంజోటి, ముంగి, మిర్జాపూర్(ఎన్), హద్నూర్, బసంత్‌పూర్, న్యాల్‌కల్ ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంది. గుంజోటిలో మాజీ జడ్పీటీసీ, సీనియర్ నాయకుడు చంద్రప్ప భార్య మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బ్యాత చెన్నమ్మ బరిలో ఉండగా, అదే స్థానం నుంచి మాజీ ఎంపీటీసీ సభ్యుడు దెశెట్టి పాటిల్ పోటీల్లో ఉన్నారు. ముంగిలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడి భార్య, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి పోటీలో ఉండగా, అదే స్థానానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి భార్య అరుణ కూడా పోటీలో ఉన్నారు. హద్నూర్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు ప్రవీణ్‌కుమార్ బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్ రజియోద్దీన్ మక్సూద్ అలీ మనుమడు అమీర్ జహీరోద్దీన్ అలీ పోటీలో ఉన్నారు. బసంత్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి భార్య మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి పోటీలో ఉన్నారు. న్యాల్‌కల్‌లో మాజీ సర్పంచ్ గంగమ్మ, జ్యోతి బరిలో ఉన్నారు. మిగిలిన మిర్జాపూర్(ఎన్) జీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాస్కర్‌రెడ్డి సొంత గ్రామం కావడంతో అక్కడ కూడా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోటీ పడుతున్న వారిలో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరు గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. ఇరు పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
జహీరాబాద్: పంచాయతీల పాలన వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైన గ్రామ పంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1959 అక్టోబర్ 2న అమలు చేసింది.
మొదట్లో పరోక్ష పద్ధతిలో..
ఆంధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500లకు పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్‌లు అంతా కలిసి సమితి ప్రసిడెంట్‌ను ఎన్నుకునేవారు. సమితి ప్రసిడెంట్‌లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే వారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు..
1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
మండల వ్యవస్థతో మార్పులు..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1996 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దుచేసి, మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. 1957లో మండల పరిషత్‌లకు మొదటి సారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా అయా మండలాల పరిధిలోని సర్పంచ్‌లు ఉండేవారు. మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్‌లను ఎన్నుకునేవారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీ ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ రూపుదిద్దుకుంది. మండల పరిషత్‌లో సర్పంచ్‌లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్‌లను ఎన్నుకోవడం ప్రారంభమైంది.
ఆరు దశాబ్దాలు


