కట్టుదిట్టమైన నిషేధాజ్ఞలు
● ర్యాలీలు, సభలు, విజయోత్సవాలు వద్దు
● కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
● స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల తుది దశ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసుశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ నుంచి కౌంటింగ్ ముగిసే వరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 18వ తేదీ ఉదయం వరకు ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయి. జనాలు గుమిగూడటం, సభలు, సమావేశాలు నిర్వహించడం, విజయోత్సవ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడంపై ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.
మూడంచెల భద్రత
జిల్లాలో మూడో విడత ఎన్నికలను పురస్కరించుకొని పోలీసు అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 1,160 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించారు. ఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, కల్హేర్, కంగ్టి, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్‌కల్ మొత్తం ఎనిమిది మండలాల్లో 234 పంచాయతీలకు గాను 27 ఏకగ్రీవం కాగా 207 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిఘా కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన 1,583 మందిని ఇప్పటికే పోలీసులు బైండోవర్ చేశారు.
పారదర్శకంగా వ్యవహరించాలి
అన్నిశాఖల అధికారులు ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రవర్తనా నియమావళి అనుసరించి విధులు నిర్వర్తించాలని సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సీనియర్ అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. ఎవరైనా వ్యక్తులకు కానీ, పార్టీలకు కానీ మద్దతు ఇచ్చినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.


