అందోల్‌లో బీజేపీ డీలా | - | Sakshi
Sakshi News home page

అందోల్‌లో బీజేపీ డీలా

Dec 17 2025 11:11 AM | Updated on Dec 17 2025 11:11 AM

అందోల

అందోల్‌లో బీజేపీ డీలా

బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందమే కారణమా!

బీజేపీ ముఖ్య నాయకుల గ్రామాల్లో అభ్యర్థులే లేరు

పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి

లోకసభ ఎన్నికల్లో బీజేపీకి 66వేల ఓట్లు

వట్‌పల్లి(అందోల్‌): స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని , ఢిల్లీలోనే కాదు.. ఈ సారి గల్లీలోనూ కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎన్నికల ముందు ప్రకటనలు చేశారు. దీంతో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పోటీకి సిద్ధపడగా జిల్లా, నియోజకవర్గ నాయకులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. పార్టీ అఽధిష్టాన వర్గం నుంచి ఎలాంటి మద్దతు ఉండదని, మీకు ఇష్టమైతే పోటీ చేసుకోండని చెప్పడంతో అందోలు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పోటీకి దూరంగా ఉన్నారు. లోకసభ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో బీజేపీకి 66,118 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కంటే 31,932 ఎక్కువ ఓట్లు వచ్చాయి.

కానీ బీఆర్‌ఎస్‌ 9 మండలాల్లో కేవలం నాలుగైదు గ్రామాల్లో మాత్రమే పోటీ చేసినా.. ఎ క్కడా గెలువలేదు. బీజేపీ బలంగా ఉన్న గ్రామా ల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం క్యాడర్‌లో కనిపించినా నాయకుల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో విరమించుకున్నారు.

బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన బీజేపీ!

రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఉప్పు, నిప్పులా ప్రతి రోజు ఆ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ పంచాయతీల్లో బీజేపీ స్నేహ హస్తం అందించింది. పుల్కల్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నిక కాగా, బీజేపీకి చెందిన వ్యక్తిని ఒప్పందంలో భాగంగా ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుడు అనంతరావు కులకర్ణి మద్దతుతోనే ఇక్కడ విజయం సాధించినట్లు వినికిడి. అందోలు మండలం డాకూరు పంచాయతీ ఎన్నికలో కూడా గ్రామానికి చెందిన జిల్లా స్థాయి బీజేపీ నాయకుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే మద్దతిచ్చారు. వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ ముఖ్య అనుచరుడైన పల్వట్ల జగదీశ్వర్‌ తన స్వగ్రామంలో అభ్యర్థిని పోటీకి దింపలేదు. కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో ముఖ్యపాత్ర పోషించినట్లు గ్రామస్తులు తెలిపారు. అదే మండలానికి చెందిన నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ మఠం చంద్రశేఖర్‌ తన స్వగ్రామమైన దేవునూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. మాజీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ ఇన్‌చార్జి ఆర్‌.ప్రభాకర్‌ గౌడ్‌ తన స్వగ్రామమైన వట్‌పల్లి మండలం గొర్రెకల్‌లో బీజేపీ అభ్యర్థిని పోటీలోకి దింపలేదు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలిపినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కొన్ని గ్రామాల్లో పోటీకి ముందుకొచ్చినా... మద్దతు దొరక్కపోవడంతో దూరంగా ఉన్నారు. దీంతో బీజేపీ క్యాడర్‌ నిరుత్సాహపడి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

కౌంటింగ్‌లో ఓట్ల మిస్సింగ్‌పై ఫిర్యాదు

పుల్‌కల్‌(అందోల్‌): పుల్‌కల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బోయిని మాణెమ్మ ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. పోలైన ఓట్లు , లెక్కించిన ఓట్లకు 28 ఓట్ల తేడా వస్తుందని ఆరోపించారు. వార్డు సభ్యులకు, సర్పంచ్‌ అభ్యర్థులకు పడిన ఓట్లలో తేడా ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాలను పునఃపరిశీలించాలని విజ్ఞాపన పత్రంలో కోరారు.

కూచనపెల్లిలో మద్యం, డబ్బు పట్టివేత

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలం పరిధిలో కూచనపెల్లిలో సిద్దిపేట టాస్కఫోర్స్‌ పోలీసులు మంగళవారం ఒక ఇంట్లో సోదాలు చేసి మద్యం, డబ్బు పట్టుకున్నారు. ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంతో కూచనపెల్లిలో ఒకరి ఇంట్లో సోదాలు చేశామన్నారు. రూ.5 లక్షల నగదు, రూ.1.96 లక్షల విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం అందిందని ఎస్‌ఐ చెప్పారు.

అందోల్‌లో బీజేపీ డీలా1
1/2

అందోల్‌లో బీజేపీ డీలా

అందోల్‌లో బీజేపీ డీలా2
2/2

అందోల్‌లో బీజేపీ డీలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement