నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్
ఏర్పాట్లు పూర్తి ● 207 సర్పంచ్, 1,537 వార్డులకు పోలింగ్ బరిలో 576 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3,519 వార్డు సభ్యుల అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తుది విడత గ్రామపంచాయతీల పోలింగ్ ప్రక్రియ బుధవారం జరగనుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు, న్యాల్‌కల్ మండలం కలిపి మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. అయితే.. ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు 27 మినహాయిస్తే 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 576 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో స్థానానికి సగటున ముగ్గురు బరిలో ఉన్నారు. మొత్తం 1,960 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవమైన 423 వార్డు సభ్యుల స్థానాలను మినహాయిస్తే 1,537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరనుంది. 3,519 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ ప్రక్రియ ఉంటుంది. భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. కాగా, పోలింగ్ నిర్వహణ కోసం పోలింగ్ అధికారులు, సిబ్బంది మంగళవారమే పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో తరలివెళ్లారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడతలో జిల్లాలోని అత్యంత మారుమూల మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్‌కల్ మండలాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది.
నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్
నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్


