పైసా పాయె.. పరువు పోయె..
జహీరాబాద్: ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే అతి విశ్వాసంతో మొదటి, రెండో విడతలో పోటీకి దిగిన పలువురు ఓటమితో డీలా పడ్డారు. ప్రజల్లో తమకు మంచి గుర్తింపు ఉందని, ఇది ఓట్లు తెచ్చిపెడుతుందని, పార్టీల మద్ధతు ఉంటే ఇక విజయం నల్లేరుపై నడకే అని భావించిన పలువురు ఓటమితో భంగపడ్డారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. మంచి ఫాలోయింగ్ ఉందని భావించి ఎన్నికల గోదాలోకి దిగి పలువురు చిత్తుగా ఓడిపోయారు. తాము చేసిన పనులను చూసి తిరిగి ప్రజలు పట్టం కడతారని భావించి పలువురు తాజా మాజీ సర్పంచ్, తాజామాజీ ఎంపీటీసీలు ఎన్నికల్లో పోటీకి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. దీంతో వారు నిరాశకు గురికాక తప్పలేదు. ఓటమిపాలైన వారు తీవ్ర మనోవేదకు గురయ్యారు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టిన పైసా పాయే, ఓటమి పాలవడంతో పరువు కూడా పాయే అని పలువురు వాపోతున్నారు.
అప్పులు చేసి మరీ పోటీ చేసినా..
పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఇటు పదవి రాకుండా పోగా, అటు అప్పుల పాలయ్యారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దారిలేక అయోమయంలో ఉన్నారు.
డబ్బు ఖర్చుపెట్టకున్నా వరించిన విజయం
పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకున్నా ప్రజలు ఆదరించడంతో విజయం సాధించారు. పదవి దక్కాలన్నా డబ్బే ముఖ్యం అనేది నిజం కాదని పలువురు అభ్యర్థుల విజయం తేల్చేసింది. నమ్మకంగా ఉన్నవారినే ఓటర్లు ఆదరిస్తారనేది వీరు సాధించిన విజయమే నిదర్శనం. రిజర్వుడు స్థానాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో పేదలే ఎన్నికల్లో పోటీ చేశారు.
ఓడినవారు ఎంపీటీసీ పదవిపై గురి
సర్పంచ్ పదవులకు ఓటమిపాలైన వారు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని యోచిస్తున్నారు. ప్రజలు తమపై సానుభూతి చూపుతారనే నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ప్రజల వైపు నుంచి తమకు హామీలు వస్తున్నట్లు ఓటమి పాలైన వారు పేర్కొంటున్నారు. ఓటమితో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవమంటున్నారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
మనో వేదనలో ఓటమి పాలైన అభ్యర్థులు
లక్షలు ఖర్చు పెట్టినా తప్పని ఓటమి
ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరా


