1160 మంది పోలీసులతో భద్రత
● ఎస్పీ పరితోష్ పంకజ్
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సంగారెడ్డి జోన్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో తుది విడత ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీపడొద్దని చెప్పారు. ఎనిమిది మండలాలలో జరిగే పంచాయతీ ఎన్నికలకు 1,160 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వివిధ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ సూచించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.


