కర్సయి పోతున్నాయి!
● తడిసి మోపెడవుతున్న ఖర్చు
● కార్యదర్శులకు భారమైన ఎన్నికల నిర్వహణ
● ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడంతో అవస్థలు
జహీరాబాద్: ఎన్నికల నిర్వహణకు గాను ప్రతిసారి ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేస్తుండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు జరగలేదు. దీంతో ఎన్నికల నిర్వహణ ఖర్చులను సమకూర్చుకోవడం పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో రెండేళ్ల నుంచి పాలకవర్గాలు లేక పోవడంతో పారిశుద్ధ్య పనులు, ఇతరత్రా అవసరాలకు కార్యదర్శులే అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడుతున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడం, ఖర్చుల కోసం అవసరమైన నిధులు ఇవ్వక పోవడంతో అవస్థలు పడక తప్పడం లేదు. ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్నారు.
ఖర్చులు భారంగా...
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు గ్రామస్థాయిలో కార్యదర్శులే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు ఉద్యోగుల భోజన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయించాల్సి ఉండడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రూ.25వేల నుంచి రూ.40వేల వరకు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం పంచాయతీ కార్యదర్శులు నిధులు సమకూర్చుకునే విషయంలో అవస్థలు పడుతున్నారు. అవసరమైన ఖర్చులకు గాను అప్పులు చేసినట్లు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ నిధుల నుంచి ఖర్చు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై గ్రామ కార్యదర్శుల మీద భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ఎంపీడీఓ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు గాను పంచాయతీ నిధుల నుంచి కార్యదర్శులు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే ఖర్చుచేసిన నిధులు వస్తాయన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే అన్నారు. నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల మలి విడత ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తుది విడత ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సారథులే స్వయంగా పల్లె బాట పడుతూ వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు పంచాయతీ సమరాన్ని ప్రతిష్టాత్మకంగా భావించడంతో పోటీ రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నేతలు గ్రామాలను చుట్టిముట్టి వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు గ్రామాల్లో జోరు పర్యటనలు సాగిస్తున్నారు. ప్రచారంలో వెనుకబడి ఉన్న నాయకులు, అభ్యర్థులకు ప్రచార వ్యూహాలను అందిస్తున్నారు. బడా నేతల అండదండలతో గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అభ్యర్థులు ప్రచార పర్వంలో సాగుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్య నాయకులు సైతం ఎలాగైనా గెలుపొందాలని సూచిస్తుండడంతో అభ్యర్థులు, గ్రామస్థాయి నాయకులు తమ శక్తియుక్తులన్నీ కూడగడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్య నాయకులు గ్రామాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహిస్తూ తమ పార్టీ మద్దతుగల అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అంతు చిక్కని ఓటరు నాడి
గ్రామీణ ఓటర్లు ప్రస్తుతం అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులంతా తమకు పరిచయస్తులే కావడంతో ప్రచారం కోసం వచ్చే వారితో ఆచితూచిగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అందరికీ ఒకే రకమైన భరోసా కల్పిస్తూ వారి ప్రచారానికి స్పందిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడ కూడా నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రచారం కోసం వచ్చే అభ్యర్థులను వారు తమ ఇళ్లలోకి సాదారంగా ఆహ్వానిస్తూ ఓటు మీకే వేస్తామని చెబుతున్నారు. ఓటర్ల స్పందనను చూసి అభ్యర్థులంతా గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఓ వీధి వారంతా తమకే మద్దతునిస్తున్నారని, అలాగే కుల సంఘాలు, యూత్ సభ్యులు కూడా తమకే అండగా ఉంటున్నారంటూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
ప్రలోభాలకు ఎర!
శుక్రవారం సాయంత్రం రెండో విడత ప్రచారానికి తెరపడింది. పోలింగ్‌కు సమయం ఉండడంతో ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. చివరి దశకు చేరుకోవడంతో ఉన్న రెండు రోజులు అత్యంత విలువైనది భావించి రహస్య మంతనాలు సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అత్యంత విలువైన సమయాన్ని అతి చాకచక్యంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నారు. గ్రామాల్లో మందు, విందులు, తాయిలాలు జోరందుకున్నాయి.
కర్సయి పోతున్నాయి!
కర్సయి పోతున్నాయి!


