రూ.1100 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ప్రతిపాదించిన ఎస్టీపీ ప్లాంట్‌ను ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ పరిధిలోని సర్వే నంబర్ 993లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని వివిధ శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ –20 పథకంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువులను రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమీన్‌పూర్‌లోని పదెకరాలలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఇదే సర్వే నంబర్‌లో ఐదెకరాలు స్టేడియానికి, 10 ఎకరాలు నవోదయ విద్యాలయానికి కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, తహసీల్దార్ వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఉపేందర్ రెడ్డి, గోపాల్, మూనిస్, రాములు, జగదీశ్, మోడికాలనీ ప్రతినిధి రమేష్ పాల్గొన్నారు.


