ఒకసారి భర్త సర్పంచ్.. మరోసారి భార్య
● దశాబ్దాలుగా వారి ఏలుబడిలోనే 10 గ్రామ పంచాయతీలు
● హత్నూర మండలంలో విచిత్రం
సతి, పతులకే పగ్గాలు
హత్నూర( సంగారెడ్డి): రాజకీయాల్లో ఓ చిన్న పదవి కోసం నానా పాట్లు పడుతుంటారు. కానీ.. ఇక్కడ పది గ్రామాలు భార్యాభర్తల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఒకసారి భర్త సర్పంచ్ అయితే... మరోసారి భార్య సర్పంచ్ పదవి పగ్గాలు చేపడుతారు. ఇలా హత్నూర మండలంలోని పది పంచాయతీల్లో దశాబ్దాలుగా పతి, సతుల పాలనే కొనసాగుతోంది. మండలంలోని చీక్ మద్దూర్‌లో గతంలో సర్పంచ్‌గా శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో భార్యా ప్రవీణ ఎంపీటీసీగా కొనసాగారు. ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ తరపున ప్రవీణ సర్పంచ్‌గా విజయం సాధించారు. గోవిందరాజ్ పల్లి గ్రామ సర్పంచ్‌గా బండమీది సునీత ఉండగా.. ప్రస్తుతం ఆమె భర్త బండమీది రాజు ఎన్నికయ్యారు. లింగాపూర్‌లో చార్ల లక్ష్మి గతంలో సర్పంచ్‌గా పనిచేయగా ప్రస్తుతం కొడుకు మణిదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొన్యాల గ్రామంలో రెండోసారి దానంపల్లి సుజాత విజయం సాధించారు. ముచ్చర్ల గ్రామ సర్పంచ్‌గా గతంలో అనిత ఉండగా.. ప్రస్తుతం ఆమె భర్త యాదగిరి విజయం సాధించారు. సాధులనగర్ గ్రామ సర్పంచ్‌గా రెండోసారి కర్రే లక్ష్మి విజయం సాధించారు. మధుర గ్రామ సర్పంచ్‌గా గతంలో మాధవిపనిచేయగా.. ప్రస్తుతం భర్త నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే.. కొడిపాకలో మాధవి యాదవ్ రెండోసారి విజయం సాధించారు. దౌల్తాబాద్ సర్పంచ్‌గా సంగీత విజయం సాధించగా.. భర్త నర్సింలు గతంలో ఎంపీపీగా పనిచేశారు. కొత్తగూడెం గ్రామ సర్పంచ్‌గా లకావత్ మాధవి ఏకంగా మూడోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా మండలంలోని 10 గ్రామాల్లో భార్యాభర్తల ఏలుబడిలోనే పంచాయతీ పాలన కొనసాగుతోంది.


