ఆ కుర్చీ కాస్ట్‌లీ గురూ..!
పేరు ప్రతిష్ట.. చెక్‌పవర్
ఉప సర్పంచ్ కోసమూ భారీగానే ఖర్చు
ఉప సర్పంచ్
రియల్ ఎస్టేట్, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన ఓ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం తనకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులకు ఒక్కొక్కరి రూ.3 లక్షల చొప్పున నజరానా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని ముందస్తుగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
మరో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవి కోసం తనకు మద్దతుగా ఓటు వేసినందుకు గాను ఆయా వార్డు సభ్యులకు ఈ ఎన్నికల్లో అయిన ఖర్చు మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఆరుగురు వార్డు సభ్యుల ఖర్చు సుమారు రూ. ఆరు లక్షల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో మరో గ్రామ ఉప సర్పంచ్ పదవి కోసం ముందస్తుగానే ఐదుగురు వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.లక్షల్లో నగదును ముట్టజెప్పినట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఇలా కేవలం సర్పంచ్ పదవులకే కాదు, ఉప సర్పంచ్ పదవుల కోసం కూడా కొందరు అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఈ ఉప సర్పంచ్ ఎన్నికలో తమకు ఓటు వేసిన వార్డు సభ్యులకు పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టచెబుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసి వార్డు సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు, ఉప సర్పంచ్ పదవిని పొందేందుకు అంతకు మించి ఖర్చుకు వెనుకాడటం లేదు. జిల్లాలో తొలి విడతలో మొత్తం 129 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. కౌంటింగ్ తొందరగా ముగిసి ఫలితాలు వచ్చిన వెంటనే మొత్తం 109 గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నికను గురువారమే నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైన 20 గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నిక శుక్రవారం జరిగింది. ఒకటీ, రెండు పంచాయతీలు మినహా తొలి విడతలోని 129 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అయితే సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు కలిసి రాని నేతలు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడటంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.
తమకు ఓటేసిన వార్డు సభ్యులకు నజరానాలు
పలుచోట్ల వార్డు సభ్యుల ఎన్నికల ఖర్చును భరించిన ఆశావహులు
తొలి విడతలో దాదాపు 129 గ్రామాల ఉపసర్పంచ్ పదవుల ఎన్నిక పూర్తి
ఉప సర్పంచ్ పదవికి కూడా గ్రామాల్లో కొంత ప్రతిష్ట ఉంటుంది. ఉప సర్పంచ్ అని పిలుపించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. దీంతో ఆశావహులు ఖర్చుకు వెనుకాడలేదు. దీనికి తోడు ఉప సర్పంచ్‌కు కూడా చెక్‌పవర్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందని భావించి ఈ పదవి వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చి సర్పంచ్ సస్పెండ్ అయితే ఉప సర్పంచ్ కీలకం అవుతారు. దీంతో ఈ పదవులకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో నాయకులు రూ.లక్షల్లో ఖర్చు చేసి ఈ పదవిని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.


