కుటుంబాల్లో పంచాయతీ
● పచ్చని పల్లెల్లో ఎన్నికల చిచ్చు
● విడిపోతున్న పేగు బంధాలు
● దూరమవుతున్న బంధుమిత్రులు
● పోటీలో గురువు..శిష్యుడు
● వరుసకు బావ బామ్మర్దులు
సంగారెడ్డి: ‘స్థానిక’ఎన్నికలు కుటుంబాల్లో ‘పంచాయితీ’ పెడుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. బంధువులు, పేగు బంధాలు, మిత్రులు ఒకరికొకరు అపార్థం చేసుకుంటూ వారి మధ్య చిచ్చు పెట్టుకుంటున్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల ఎంపికలు అన్నదమ్ములు, తోడికోడళ్లు, అత్తా కోడళ్లు బరిలో నిలుస్తూ వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు. దగ్గర స్నేహితులు బరిలో నిలుస్తూ ఒకరికొకరు రాగాద్వేషాలను పెంచుకుంటూ వారి స్నేహ బంధానికి దూరమవుతున్నారు. ప్రజలందరూ ఎలాంటి మనస్పర్ధలకు వెళ్లకుండా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మాదిరిగా జీవించేది పోయి ఒకరికొకరు దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు ఆందోళనకరంగా మారాయి. గ్రామ ప్రజలందరూ ఎలాంటి రాగాద్వేషాలకు వెళ్లకుండా స్నేహపూర్వకంగా మంచి మనసుతో ఆలోచనలు చేసి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే అధికారులు సైతం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామ ప్రజలు యూత్, ఓటర్లందరూ సంయమనం పాటించి ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆకాంక్షిద్దాం.
నాడు సతులు.. నేడు పతులు
టేక్మాల్(మెదక్): టేక్మాల్ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో గురువు, శిష్యుడి మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో టేక్మాల్‌కు బీసీ మహిళ రిజర్వ్ కాగా వారి సతులను నిలబెట్టారు. రెండు ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి నాయికోటి సుప్రజ గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో రిటైర్డ్ ఉప విద్యాధికారి కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మిగారి సుధాకర్, గులాబీ అభ్యర్థి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాయికోటి భాస్కర్ మధ్య పోటీ తీవ్రంగా సాగుతుంది. వీరిద్దరూ గురువు శిష్యులు, అంతేకాకుండా వరుసకు బావ బామ్మర్దులు. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న టేక్మాల్‌లో మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థులు గెలవలేదు. అధికార పార్టీ అభ్యర్థి సుధాకర్ గెలిస్తే రికార్డు బ్రేక్ చేస్తారా? లేదా బీఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టంకట్టి గెలిపిస్తారో వేచి చూడాలి.
సుధాకర్
భాస్కర్
తండ్రి కొడుకు మధ్య వార్
వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీ ఎన్నికలు సాధారణ కుటుంబాలను విభజిస్తున్నాయి. మండలంలోని శంశిరెడ్డిపల్లి తండాలో సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. సర్పంచ్‌గా బానోత్ గణేశ్, ఉపసర్పంచ్‌గా ఆనబోయిన నర్సింలుతో పాటు మిగిలిన వార్డులకు సభ్యులను నిర్ణయించారు. నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం సాయంత్రం గ్రామస్తుల తీర్మానం మేరకు గణేశ్ సర్పంచ్‌గా, మిగిలిన సభ్యులు వార్డు మెంబర్లు నామినేషన్లు వేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గణేశ్ కుమారుడు వినోద్ నేను సర్పంచ్‌గా ఉంటానంటూ నామినేషన్ వేయడానికి సంబంధిత పత్రాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. నేను ఉండగా నీవు సర్పంచ్‌గా ఎలా నామినేషన్ వేస్తావంటూ తండ్రి ప్రశ్నించాడు. గణేశ్ సర్పంచ్‌గా ఉంటేనే తాము ఏకగ్రీవానికి అంగీకరిస్తామని, కుమారుడిని అంగీకరించబోమంటూ తండావాసులు స్పష్టం చేశారు. దీంతో తండ్రి కుమారుడి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కోపంతో వినోద్ తన చేతిలోని నామినేషన్ పత్రాన్ని చించివేసి గందరగోళం సృష్టించాడు. చివరికి పోలీసులు అడ్డుకొని యువకుడికి సర్దిచెప్పడంతో బయటకు వెళ్లిపోయాడు.
అన్నదమ్ముల మధ్య పోరు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లి సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు నామినేషన్లు వేశారు. గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నీరుడి అశోక్ నామినేషన్ వేయగా, అతని తమ్ముడు కుమార్ బీఆర్‌ఎస్ మద్దతుదారుగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా అశోక్ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసి మెదక్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ఇంటి వద్దే వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేస్తున్నాడు. కాగా వీరి మధ్య పోటీ గ్రామంలో ఆసక్తికరంగా మారింది.
అశోక్
కుమార్
కుటుంబాల్లో పంచాయతీ
కుటుంబాల్లో పంచాయతీ
కుటుంబాల్లో పంచాయతీ
కుటుంబాల్లో పంచాయతీ
కుటుంబాల్లో పంచాయతీ
కుటుంబాల్లో పంచాయతీ


