వామ్మో.. మళ్లీ పోటీనా.!
లక్షలు పెట్టి గెలిస్తే..
చిప్ప చేతికి
జంకుతున్న తాజా మాజీ సర్పంచ్‌లు
● లక్షలు పెట్టి గెలిచి.. ఆస్తులు అమ్ముకోవడమే..
● పోటీకి ఆసక్తి చూపని వైనం
దుబ్బాక: తమకు అవకాశం ఉన్నా మళ్లీ పోటీ చేసేందుకు తాజా మాజీ సర్పంచ్‌లు జడుసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో తమకు అనుకూలంగానే రిజర్వేషన్లు వచ్చినప్పటికీ తాజా మాజీలు పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలు గ్రామాల్లో సాక్షి ఆరా తీయగా లక్షలు పెట్టి సర్పంచ్‌లుగా గెలిచి ఉన్న ఆస్తి పాస్తులు అమ్ముకున్నాం.. అప్పుల పాలయ్యామంటూ పలువురు తాజా మాజీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు చాలా తారుమారయ్యాయి.. పైసలు ఉంటేనే పదవులు వస్తాయి తప్పా.. ఏదో చేస్తామంటూ తొందరపడి పోటీచేస్తే అంగి, లాగే మిగులుతుందని మరేం ఉండదంటూ తమ అనుభవాలు చెప్పారు.
అప్పుల పాలయ్యాం...
తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చినా మళ్లీ పోటీ అంటేనే చాలా మంది తాజా మాజీ సర్పంచ్‌లు జడుసుకుంటున్నారు. కొంతమంది పదవిపై వ్యామోహంతో పోటీకి సిద్ధం కాగా వారి కుటుంబాల్లో (భార్య,పిల్లలు) నామినేషన్ వేస్తే తాము ఇంట్లో ఉండమని, చస్తామంటూ బెదిరించిన సంఘటనలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే సర్పంచ్ అయి అప్పుల పాలయ్యాం.. మళ్లీ ఆ పొరపాటు చేయమంటూ చాలా మంది పోటీకి దూరంగానే ఉంటున్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు పెట్టిన డబ్బులే దిక్కులేవని.. ఆ పైసలు ప్రభుత్వం ఇస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటామని తాజా మాజీ సర్పంచ్‌లు తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఎనుకట మా తాత సర్పంచ్‌గా చేసిండంటా.. ఇప్పుడు నేను సర్పంచ్ అవుతానంటూ చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి గతంలో సర్పంచ్‌లుగా గెలిచి ఆస్తులు అమ్ముకున్న వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న గ్రామానికి (500 ఓట్ల లోపు ఉన్న) సర్పంచ్ కావాలంటే కనీసం రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టిన గెలిచేది నమ్మకం తక్కువ అంటూ పలువురు మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.


