విత్తన కంపెనీలో ఇంటి దొంగలు
ములుగు(గజ్వేల్): తాము పనిచేస్తున్న విత్తన కంపెనీలోనే విత్తనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇంటి దొంగల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బయటి వ్యక్తులతో ముఠాగా ఏర్పడి విత్తనాలను బయటకు పంపుతున్న నిందితుల్లో పలువురిని అరెస్టు చేశారు. ములుగు మండలం కొత్తూరు నూజివీడ్ సీడ్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్‌ఐ రఘుపతి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ములుగు మండలం కొత్తూరు సమీపంలోని నూజివీడ్ విత్తన పరిశ్రమలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కలసి రూ.57.50 లక్షల విలువ చేసే 9,968 కిలోల మొక్కజొన్న విత్తనాలను దొంగతనంగా బయటకు పంపించారు. గత నెల 29న కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు పోలీసులు కంపెనీ వద్ద గురువారం సాయంత్రం నిఘా ఉంచారు. కంపెనీ నుంచి విత్తనాలు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పందిరి రమేశ్, మాజీ ఉద్యోగి పెద్దిరెడ్డి సురేశ్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన బస్సీ యశ్వంత్, సోహెల్‌ను పట్టుకొన్నారు. నిందితులను విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ నేరంతో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్టు చేశామని, కొందరు పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. అరెస్టయిన వారి నుంచి రూ.3,29,500; 12 మొబైల్ ఫోన్‌లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పర్చామని, మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు.
గుట్టురట్టు చేసిన పోలీసులు
పలువురు నిందితుల అరెస్టు, పరారీలో మరికొందరు
రూ.3.29 లక్షలు, 12 మొబైల్ ఫోన్లు, 3 వాహనాలు స్వాధీనం
కొత్తూరు నూజివీడ్ విత్తన కంపెనీలో ఘటన


