పదవి వచ్చే.. పొలం పాయే
● గత సర్పంచ్‌ల పరిస్థితి
● ప్రస్తుతం ఎన్నికల ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు
మునిపల్లి(అందోల్): ‘మండంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గత పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టకు పోయి సర్పంచ్‌గా తన భార్యను గెలిపించుకున్నాడు. అనంతరం ఖర్చుకు వెనకాడక ఐదేళ్లలో సుమారు 3 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అమ్ముకున్నాడు. సర్పంచ్‌గా తన భార్యను గెలిపించి పంతం నెగ్గించుకున్నాడే తప్ప, అస్థిని కాపాడుకోలేక పోయారు’. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారి పరిస్థితి గెలిస్తే అందలం, ఒడితే పాతాళం అన్న మాదిరిగా తయారైంది. బలమైన అభ్యర్థులతో పోటీ అంటే అషామాషి కాదు. రాజకీయంలో పడి అప్పులు చేసి ఎన్నికల్లో గెలవాలనే పంతం పెట్టుకుంటున్నారు. రాజకీయ అనుభవం లేని వారు కొందరైతే, రాజకీయంగా సంవత్సరాల తరబడి అన్ని రకాలుగా ఉన్నవారు కొందరు. సర్పంచ్ పదవి కోసం మండలంలోని ఆయా గ్రామాల్లోని 8 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఎన్నికల ఖర్చు 14వ తేదీ వరకు ఖర్చు పెట్టడం అభ్యర్థులకు తలకుమించిన భారంగా మారవచ్చు. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న కొందరు తమకు తెలిసిన వారి దగ్గరల్లా అప్పులు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలో గెలిస్తే 5 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్‌గా గ్రామాభివృద్ధి చెద్దామనే అశతో కొందరు. రాజకీయమంటే తెలియని వారు అందలం ఎక్కుతామనే భావనలో ఇంకొందరు అభ్యర్థులున్నారు. మరికొందరు బంగారంతో పాటు స్నేహితుల దగ్గర అత్తమామల దగ్గర అప్పులు చేస్తూ గ్రామంలో గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోసారి అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవచ్చని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇదేనని అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు.


